ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు గత సోమవారం నుంచి మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లాయి. ప్రతి మూడు నిమిషాలకో ఒకసారి ఇజ్రాయెల్‌ లో ఎక్కడో ఒకచోట రాకెట్ ప్రయోగించబడింది. గాజాను పాలిస్తున్న మిలిటెంట్ సంస్థ హమాస్, జెరూసలేంలో అల్ అక్సా మసీదు దగ్గర ఉన్న ఇజ్రాయెల్ సైనికులను ఆ ప్రాంతం నుంచి వైదొలగమని హెచ్చరిక చేస్తూ రాకెట్లను ప్రయోగించడం మొదలు పెట్టింది. దీనికి ప్రతి దాడులగా ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగింది. వెలకొద్దీ రాకెట్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ అతిస్వల్ప నష్టంతో బయటపడింది.

అయితే, ఇజ్రాయెల్‌ను కేవలం ఒక రక్షణ వ్యవస్థే కాపాడిందని చెప్పుకోవాలి. అదే “ఐరన్‌డోమ్‌” ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. పదేళ్ల క్రితం నుంచి సేవలు అందించడం ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పటి వరకు కొన్ని వేల రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తలో కేంద్ర బిందువుగా మారింది.

ఐరన్‌ డోమ్‌ అంటే ఏమిటీ?

సాధారణంగా తక్కువ దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను పేల్చడానికి స్వల్ప శ్రేణి రాకెట్లను ప్రయోగిస్తారు. దూరం తక్కువగా ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సైన్యానికి తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే అంచనా వేసి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థను ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది. దీనినే ఐరన్‌డోమ్‌గా పిలుస్తున్నారు. ఇది 2011లో వినియోగంలోకి వచ్చింది.

గాజాపట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లను ఇది సమర్దవంతంగా ఎదుర్కొంటుంది. దీని పరిది 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది కాకుండా ఇజ్రాయెల్‌ వద్ద ‘డేవిడ్‌స్లింగ్‌’,‘యారో’ అనే దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి రక్షించే రెండు వ్యవస్థలు ఉన్నాయి. హెజ్బుల్లా దళాలు 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతాలపై 4,000 రాకెట్లు ప్రయోగించాయి. ఫలితంగా సుమారు 44 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అలాగే, 2,50,000 మంది పౌరులను వారి ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లారు. ఇజ్రాయిల్ పై జరిపిన వరుస రాకెట్ దాడుల తర్వాత దీనిని అభివృద్ధి చేసింది.

ఎలా పనిచేస్తుంది..?

ఐరన్ డోమ్ బ్యాటరీలో యుద్ధ నిర్వహణ నియంత్రణ యూనిట్, సాఫ్ట్‌వేర్‌, రాడార్లు ఉంటాయి. గాజాపట్టీ నుంచి రాకెట్‌ ప్రయోగించిన వెంటనే వ్యవస్థలోని రాడార్‌ పసిగట్టి.. దాని గమనాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు వెంటనే అందిస్తుంది. వచ్చే రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తించి ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. అదే వ్యూహాత్మక ప్రాంతంలో, జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ఐరన్‌ డోమ్‌ నుంచి వెలువడిన టమిర్‌ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్‌ను గాల్లోనే నాశానం చేస్తుంది.

Image Credit: CSIS: Companies FT research

2011లో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయెల్‌ ఎప్పటికప్పుడు అభివృద్ది పరుస్తుంది. హార్డ్‌వేర్‌ విషయంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ముప్పును విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ను మాత్రం ఎక్కువ శాతం అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఐరెన్‌ డోమ్‌ క్షిపణులు, డ్రోన్లు వంటి ముప్పులను సమర్థంగా ఎదుర్కోగలదని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ విభాగానికి చెందిన మోషెపటేల్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో దీనిని అమర్చిన నాటి నుంచి వేల సంఖ్యలో హమాస్‌ రాకెట్లను నాశనం చేసినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు చెబుతున్నారు. ఈ గగనతల రక్షణ వ్యవస్థ 90 శాతంకు పైగా విజయవంతగా రాకెట్లను కూల్చేసినట్లు వెల్లడించారు.

తగ్గిన ప్రాణ నష్టం..

ఈ వ్యవస్థ రాక ముందు గాజాపట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడికి ఇజ్రాయెల్‌ సైన్యాన్ని పంపించాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరు పక్షాలవైపు ప్రాణనష్టం శాతం ఎక్కువగా ఉండేది. కానీ, ఈ వ్యవస్థ వచ్చాక దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థలోని అప్రమత్తం చేసే సైరన్‌ విని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్‌ నుంచి ఈ వ్యవస్థలను కొనుగోలు చేసింది.

హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ చిన్న స్థాయి ఖాస్సామ్‌ రాకెట్లను భారీ సంఖ్యలో ఇజ్రాయెల్‌ మీద ప్రయోగిస్తుంటుంది. దీనిని హమాసే సంస్థ ఇరాన్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఒక్కో రాకెట్‌ ఖరీదు 4వేల డాలర్ల లోపే ఉంటుందని సమాచారం. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు 80వేల డాలర్లు ఉంటుంది. ఇప్పటి వరకు హమాస్‌ సంస్థ ఇజ్రాయెల్‌పై దాదాపు 1750 రాకెట్లను ప్రయోగించింది. వీటిల్లో చాలా వరకు ఐరన్‌డోమ్‌ గాల్లోనే పేల్చేసింది. అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే జనావాసాలపై పడ్డాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.