ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్(37) రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాడా? బోర్డులో మెజార్టీ సభ్యులు ఎంత వద్దని వారిస్తున్నా.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోనున్నాడా? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సంచలన ఆరోపణలు ఇవే. అయితే, జుకర్‌బర్గ్ నేతృత్వంపై వినిపిస్తున్న ఈ విమర్శలు నిజమే అని బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనం ప్రచురించింది. ఈ డిజిటల్ ప్రపంచంలో ‘మెటావర్స్’ ద్వారా అద్భుతాల్ని సృష్టించాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
దీనికోసం యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా 10 వేల మంది అధిక నైపుణ్యం గల ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో ఫేస్‌బుక్ నియమించుకోనుంది. అయితే ఈ నియామక ప్రక్రియ కోసం జరిగిన ఒక కీలక సమావేశంలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా.. లేకున్నా ఫేస్‌బుక్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీదా ఉందంటూ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడట. దీని అర్ధం సీఈఓ పదివి నుంచి జూకర్ జుకర్‌బర్గ్ తప్పుకోవడమే అని ఫేస్‌బుక్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు కథనం ప్రచురించినట్లు సదరు టాబ్లాయిడ్ పేర్కొంది.(ఇది కూడా చదవండి: అదృష్టమంటే వీరిదే..! ఏడాదిలో లక్షతో రూ.42 లక్షలు సంపాదన!)