Amazon Kuiper Satellite Internet: అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తేవడంపై ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కసరత్తు చేస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ లీజింగ్‌ వ్యయాలు, అనుమతులు తదితర అంశాలపై చర్చించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ (డీవోఎస్‌), టెలికం శాఖ (డాట్‌)లతో సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.(ఇది కూడా చదవండి: కరోనా: మార్కెట్లో ఉన్న మంచి పల్స్ ఆక్సీమీటర్లు)

కైపర్ పేరుతో చేపట్టిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ప్రాజెక్టులో భాగంగా 3,236 పైచిలుకు ఉపగ్రహాలను ’లో ఎర్త్‌ ఆర్బిట్‌’ (ఎల్‌ఈవో) ప్రవేశపెట్టడానికి అమెజాన్‌ దాదాపు 10 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంది. కైపర్ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అయితే, ఇప్పటిదాకా అధికారికంగా భారత్‌కు సంబందించిన ప్రణాళికలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

కీలక మార్కెట్‌గా భారత్‌..

గణాంకాల ప్రకారం చూస్తే.. దేశీయంగా దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ సేవలు అనేవి ఇప్పటికీ అందుబాటులో లేవు. చాలా వరకు ప్రాంతాలకు సెల్యులార్‌ లేదా ఫైబర్‌ కనెక్టివిటీ అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. అలాగే, గ్రామాల్లో ప్రజల సంఖ్య తక్కువగా కాబట్టి భారీ మొత్తంలో ఖర్చు చేసి ఫైబర్‌ కేబుల్స్ వేసిన ప్రయోజనం తక్కువగా ఉంటుందని కంపెనీలు కూడా పట్టణ ప్రాంతాల వరకు మాత్రమే పరిమితమయ్యాయి.

దీంతో ’లో ఎర్త్‌ ఆర్బిట్‌’ (ఎల్‌ఈవో) శాటిలైట్‌ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థలకు భారత మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు, మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఈ తరహా సేవలు అందించడం ద్వారా రాబోయే కాలంలో దాదాపు 500 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయాల ఆర్జనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ను అమెజాన్‌ పక్కన పెట్టే పరిస్థితి ఉండబోదని నిపుణులు తెలిపారు.

పోటీగా స్పేస్ ఎక్స్, వన్ వెబ్

స్పేస్ ఎక్స్(Space X), వన్ వెబ్(OneWeb) శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కంపెనీల వైఖరి ఇప్పటికే స్పష్టం కావడంతో అమెజాన్‌ ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది. ఒంటరిగా రంగంలోకి దిగుతుందా లేదా దేశీయంగా ఉన్న ఇతరత్రా ఏదైనా సంస్థతో జట్టు కడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వన్‌వెబ్‌లో భారతి గ్రూప్‌ ఇప్పటికే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇక మిగిలింది రెండు టెలికం సంస్థలు. ఒకటి జియో కాగా.. మరొకటి వొడాఫోన్‌ ఐడియా. అయితే, ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారాల కొనుగోలు విషయంలో రిలయన్స్‌తో అమెజాన్‌ తో న్యాయపోరాటం చేస్తోంది. కాబట్టి దానితో జట్టు కట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 5జీ టెక్నాలజీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అవసరం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.