టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో అక్రమాలకు పాల్పడుతుందని వస్తున్న ఆరోపణలు నిజమని తేలింది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత ఆరోపణల్ని నిర్ధారించుకున్న దర్యాప్తు ఏజెన్సీ సీసీఐ. భారత్ మార్కెట్ లో అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసి గూగుల్ లాభపడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. అమెరికాకు చెందిన అమెజాన్, యాపిల్ సహా అరడజను కంపెనీలు ఈ తరహా ఆరోపణలే చుట్టుముట్టాయి.

అక్రమాల ఆరోపణలివే..
తయారీ కంటే ముందే గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న కంపెనీల యాప్‌ల్ని ఇన్‌స్టాల్ చేయాలని డివైజ్ తయారీదారులను ఒత్తిడి చేసినట్లు గూగుల్‌పై మోపబడిన ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అందుకే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. యాప్ మార్కెటింగ్‌లో ఇతరు కంపెనీలకు స్థానం ఇవ్వకపోవడం భారత చట్టాల ప్రకారం నేరం. ఈ మేరకు సదరు వేధింపులపై అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF) ఫిర్యాదు చేయడంతో సీసీఐ 2019లో దర్యాప్తు మొదలుపెట్టింది.
డివైజ్ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్‌లను(ఫోర్క్స్) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. అధికారిక ప్రకటనతో పాటు, గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.(చదవండి: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరుని మార్చుకోవడం ఎలా..?)

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తుంది. వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం సీసీఐకి ఉంది.