ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సప్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. వాట్సాప్ తీసుకొచ్చిన WhatsApp Pay సేవలకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఇక మీదట నుండి వాట్సప్ యుపిఐ ద్వారా మొదట 20 మిలియన్ వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించి దశల వారీగా ఇతరులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించడానికి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఫోన్‌పే ఇప్పటికే ఈ సదుపాయాన్ని 250 మిలియన్ల యూజర్లకు అందిస్తుంది. భవిష్యత్తులో ఎన్‌పిసిఐ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్‌ల జరిగే అన్ని లావాదేవీలను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. ఇది జనవరి 2021 నుండి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే యుపిఐ ద్వారా జరిగే లావాదేవీలు గూగుల్ పే మరియు ఫోన్‌పేల ద్వారా జరుగుతున్నాయి. ఈ రెండూ భారతదేశంలో జరిగే యుపిఐ లావాదేవీలలో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని తాజా నివేదిక తెలిపింది. ఇటీవల, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) ఫేస్బుక్ యొక్క వాట్సాప్ పై ఉన్న కేసును కొట్టివేసింది. దేశ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో విస్తరించడానికి కంపెనీ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయలేదని పేర్కొంది.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో వాట్సాప్ పే ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సప్. ‘వాట్సప్‌లో అందరు యూజర్లకు పేమెంట్ సేవల్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి మేం పనిచేస్తున్నాం. వాట్సప్‌లో పేమెంట్ సేవలు ప్రారంభమైతే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకుంటాయి. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని 40 కోట్ల మంది యూజర్లు సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని వాట్సప్ ప్రతినిధి ఒకరు ఈ ఏడాది మేలో మనీకంట్రోల్ వెబ్‌సైట్‌తో అన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.