వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు యాపిల్ భారత్ లో ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ ని ప్రారంభించింది. ఇక నుండి ఆపిల్ యూజర్లు ఆపిల్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అలానే కస్టమర్ సపోర్ట్, ట్రేడ్-ఇన్స్, స్టూడెంట్ డిస్కౌంట్స్, ఫైనాన్స్ ఆప్షన్స్ వంటి పలు రకాల సేవలను దీని ద్వారా అందిస్తుంది. ఇప్పటి వరకు ఆపిల్ తమ సంస్థకు చెందిన ఉత్పత్తులను విక్రయించడానికి ఈ-కామర్స్, థర్డ్ పార్టీ వెబ్ సైట్స్, ఇతర స్టోర్స్ ను సంప్రదించేది. ప్రపంచంలో అందించే అన్నీ రకాల సేవలను ఇక నుండి భారత్ లో కూడా అందించనున్నట్లు తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ అందుబాటులో లేదని ఆపిల్ ధృవీకరించింది. బహుశా, ప్రస్తుత కరోనా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చెల్లింపు విధానం అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. అన్ని ఆర్డర్‌లను కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పంపిణీ చేస్తామని కంపెనీ పేర్కొంది. లాజిస్టిక్స్ సరఫరా కోసం, ఆపిల్ బ్లూ డార్ట్ తో ఒప్పందం చేసుకుంది. ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన తేదీ నుండి 24 నుండి 72 గంటల లోపు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ డెలివరీలు వినియోగదారుడి యొక్క దూరం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది.(చదవండి: వాట్సాప్ యూజర్లూ కొంచెం జాగ్రత్త!)
ప్రస్తుతం ఈ సేవలను ఆపిల్ దేశవ్యాప్తంగా 13,000 పిన్ కోడ్‌లకు అందజేస్తుంది మరియు రాబోయే రోజుల్లో జాబితాలో మరిన్ని పిన్ కోడ్‌లకు అందజేస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో యాపిల్ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకున్న వారు తమ సందేహాలను నిపుణులైన సిబ్బందితో చర్చించి నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్, ఛాట్, ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ప్రొడక్ట్ ఇన్‌స్టాలేషన్ అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు, డివైజ్ సెట్టింగ్స్, యాపిల్ ఐడీ రికవరీకి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా సిబ్బంది సహాయం చేస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.