Semiconductor Shortage

పండుగ సీజన్‌ వస్తోందంటే చాలు ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, మొబైల్స్‌ తదితర రంగాల సంస్థలు అమ్మకాలపై ఆశావహ అంచనాలతో ముందు నుంచే కాస్త ఉత్పత్తి పెంచుకుని, విక్రయాలకు సన్నాహాలు చేసుకుంటాయి. అటు కస్టమర్లు కూడా పండుగ సమయాల్లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయనే ఆశతో ఎదురు చూస్తారు. కానీ, ఈ రంగాలలో కీలకమైన సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరతతో ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. చిప్‌ల సరఫరాలో సమస్యల కారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ భారీగా పడిపోయింది.

ఒక్క ఆటోమొబైల్‌ పరిశ్రమలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు ఆర్డర్లు పేరుకుపోయినట్లు అంచనా. సాధారణంగానైతే పండుగల సమయాల్లో భారీ డిస్కౌంట్లు పొందే కొనుగోలుదారులు ప్రస్తుత సందర్భంలో మాత్రం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ మొదలుకుని టీవీలు, కార్ల దాకా మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. డిమాండ్‌కి తగ్గట్లుగా ఉత్పత్తులు అందుబాటులో లేకపోతుండటంతో ఆటోమోటివ్‌ షోరూమ్‌లలో ఉచిత ఆఫర్లు కనిపించడం లేదు. డిస్కౌంట్ ఇచ్చిన స్టాక్ మాత్రం ఔట్ ఆఫ్ స్టాక్ కి వెళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం చిప్‌ల కొరత అని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ధరణి సమస్యలపై ఫిర్యాదు చేయాలా..? ఇదిగో ఇలా చేయండి)

‘బుకింగ్స్‌ లేదా ఎంక్వైరీలను బట్టి చూస్తే డిమాండ్‌ బాగానే ఉంది. కానీ సెమీకండక్టర్ల సమస్యతో ఈసారి దురదృష్టవశాత్తు సరఫరాపర విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుకింగ్స్‌ పేరుకుపోతున్నాయి .. ఉత్పత్తుల సరఫరా ఆ స్థాయిలో ఉండటం లేదు‘ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఈడీ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘పరిశ్రమలో 4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా పెండింగ్‌ బుకింగ్‌లు ఉన్నాయని అంచనా. మారుతీ సుజుకీ ఆర్డర్‌లే దాదాపు 2.15 లక్షల నుంచి 2.2 లక్షల యూనిట్ల దాకా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. గృహోపకరణాల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కార్లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటి తయారీలోను సెమీకండక్టర్‌ చిప్‌లు కీలకంగా ఉంటున్నాయి.