YSR EBC Nestham Scheme: అగ్రవర్ణ పేద మహిళలకూ ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇవ్వక పోయిన పేద మహిళలకూ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకంలో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఏడాదికి రూ.15 వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయనుంది.
రాష్ట్రంలో అర్హులైన మొత్తం 3,92,674 మంది పేద మహిళలకూ రూ.589 కోట్లను నేడు(జనవరి 25) సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాల్లోని (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు రూపొందించిన కానుకే ఈ ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’.