ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన(పీఎంయూవై) ‘ఉజ్వల 2.0 వంట గ్యాస్‌ పథకాన్ని మంగళవారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించారు. మహిళా లబ్దిదారులకు వర్చువల్‌ పద్ధతిలో ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ సదుపాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు ఈ అర్థికసంవత్సరేంలో కొత్తగా కోటి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద మొదటి దశలో కనెక్షన్ తీసుకొని కుటుంబాలకు రెండో దశలో అందించడానికి దీనిని తీసుకొచ్చినట్లు మోడీ పేర్కొన్నారు.

ఉజ్వల యోజన అంటే ఏమిటి?

మొదటి దశలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) కనెక్షన్లను అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)ను 2016లో ప్రారంభించారు. మరో ఏడు కేటగిరీల(ఎస్ సీ/ఎస్ టి, పిఎమ్ ఎవై, ఎఎవై, అత్యంత వెనుకబడిన తరగతులు, టీ గార్డెన్, అటవీ నివాసితులు, దీవులు) నుంచి మహిళా లబ్ధిదారులను చేర్చడానికి ఈ పథకాన్ని ఏప్రిల్ 2018లో విస్తరించారు. రెండో దశలో లక్ష్యాన్ని ఎనిమిది కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లకు విస్తరించారు.

ఉజ్వల 2.0 అంటే ఏమిటి?

ఉజ్వల 2.0 కింద మోదీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లను పేదలకు ఉచితంగా అందించనుంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని 2021-22లో కోటి మంది కొత్త లబ్ధిదారులకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే 8 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.

దరఖాస్తు చేసుకోవడానికి ఏమి కావాలి?

పీఎంయూవై ఉజ్వల 2.0 నమోదు ప్రక్రియ కోసం కనీస పేపర్ వర్క్ అవసరం. అంతేగాక, వలసదారులు ప్రయోజనం పొందడానికి రేషన్ కార్డులు లేదా చిరునామా రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి కొన్ని ప్రమాణాలు ఇక్కడ ఉన్నాయి.

  • దరఖాస్తుదారుడు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
  • మహిళ వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
  • ఆమె బీపీఎల్ కుటుంబానికి చెందిన వారు కావాలి.
  • ఆమె దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు సమర్పించాలి.
  • దరఖాస్తుదారుని కుటుంబ సభ్యుల పేరిట ఎల్‌పీజీ కనెక్షన్ ఉండరాదు.
  • ఆమె పేరిట బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

సమీప ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్ చేయడం ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. ఆన్ లైన్ ద్వారా అయితే దరఖాస్తుదారుడు pmujjwalayojana.com అధికారిక వెబ్ సైట్ నుంచి ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని ఈ ఫారాన్ని సమీప ఎల్‌పీజీ సెంటర్ వద్ద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.